20 రూపాయలకే 2 లక్షల బీమా… ఉపాధి హామీ కూలీలకు కేంద్రం వరం! | Pradhan Mantri Suraksha bima Yojana 2025 Full Details
దేశంలోని నిరుపేదలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ప్రధానమైనది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఇది ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు ఆర్థిక భరోసాను ఇస్తోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేసే ప్రతి కూలీకి ఈ పథకం వర్తిస్తుంది. కేవలం రూ. 20 చెల్లించి, రూ. 2 లక్షల బీమా పొందవచ్చని చాలామందికి తెలియదు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి ఎవరు అర్హులు?
18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యవసాయ కూలీలు, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. దీనికి నమోదు చేసుకోవడానికి, మీరు రాతపూర్వక దరఖాస్తుతో పాటు రూ. 20 ప్రీమియం చెల్లించాలి.
మరణం లేదా వైకల్యం సంభవిస్తే…
ఈ పథకం కింద, ఉపాధి పనులు చేసే ప్రాంతంలో దురదృష్టవశాత్తు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం పొందితే, కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల బీమాను అందిస్తుంది. పాక్షిక వైకల్యం సంభవిస్తే, రూ. లక్ష బీమా వర్తిస్తుంది. చాలామంది కూలీలకు ఈ పథకం గురించి అవగాహన లేకపోవడం వల్ల దీని ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.
ప్రతి సంవత్సరం రెన్యూవల్…
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రీమియం గతంలో రూ. 12 ఉండేది, కానీ ప్రస్తుతం రూ. 20కి పెరిగింది. ఈ పథకం కవరేజ్ ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా నుండి రూ. 20 ప్రీమియం ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. కాబట్టి మే 31 నాటికి మీ ఖాతాలో సరిపడా డబ్బులు ఉండేలా చూసుకోవాలి.
బీమా సొమ్ము ఎలా ఇస్తారు?
మరణం సంభవించినప్పుడు నామినీకి రూ. 2 లక్షల బీమా సొమ్ము అందజేస్తారు. రెండు కళ్ళు పూర్తిగా పోయినా లేదా రెండు చేతులు, రెండు కాళ్లు ఉపయోగించుకోలేకపోయినా కూడా రూ. 2 లక్షల బీమా అందిస్తారు. ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటి చూపు కోల్పోవడాన్ని పాక్షిక వైకల్యంగా పరిగణిస్తారు, దీనికి రూ. లక్ష బీమాను అందిస్తారు. ఈ ప్రయోజనాలను పొందాలంటే, వెంటనే పోస్టాఫీస్ లేదా బ్యాంకులను సంప్రదించి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో నమోదు చేసుకోండి.